కైలాష్ హరి వాళ్ళని పంపించడానికి కిందకి వచ్చాడు.
హరి బయలుదేరుతూ అన్నాడు కైలాష్ తో "మీరు శ్రమ అనుకోకుండా వేద ని చూసుకుంటున్నందుకు చాలా థాంక్స్."
"పర్వాలేదండి ఇందులో శ్రమేం ఉంది అయినా మీరు ఇన్నిసార్లు థాంక్స్ చెప్పడం ఏం బాలేదు"
హరి చిన్నగా నవ్వాడు. కైలాష్ తో అన్నాడు "ఎందుకో తెలీదు గానీ వేద ఇక్కడే ఉండడానికి ఇష్టపడుతోంది. ఎన్నిసార్లు అడిగినా అదే మాట చెప్తోంది. కారణం అడిగితే "అదీ ఇదీ" అని ఏదేదో చెప్తోంది కాని అసలు విషయం మాత్రం చెప్పట్లేదు. ఎందుకో తెలీదు కాని అసలు విషయం చెప్పడానికి ఇష్టపడడం లేదు అని అర్ధం అయ్యింది . అందుకే మేము కూడా ఎక్కువ బలవంతపెట్టలేదు. ఏమైనా అవసరం ఉంటే కబురు చేయండి."
"తప్పకుండా."
"సరే, మరి ఇంక వస్తామండి" అన్నాడు హరి.
"అలాగే"
"అంకుల్ బై"
"బై రేవ"
హరి వాళ్ళని పంపించేసి వస్తుండగా కైలాష్ కి ఫోన్ వచ్చింది రాధ ఫోన్ చేసింది వాళ్ళు బయలుదేరుతున్నట్టు. రాధతో మాట్లాడి కైలాష్ పైకి వచ్చాడు.
కైలాష్ పైకి వచ్చేటప్పటికి వేద రూం లో నడవడానికి ప్రయత్నిస్తోంది.
అది చూసి కైలాష్ అన్నాడు "అరే ఒక పది నిమిషాలు ఆగొచ్చు కదా వాళ్ళని పంపించి వచ్చేలొపే తొందరా"
కైలాష్ మాట వినపడడంతో వెనక్కి తిరిగి చూసింది వేద.
"అదేం లేదు కాలి నొప్పి తగ్గింది అందుకే ఒక సారి చూస్తున్నా నడవడానికి వస్తోందా లేదా అని"
"ఎలా ఉంది ఇప్పుడు నడుస్తుంటే కాలి నొప్పి తెలుస్తోందా"
"లేదు అంతగా తెలియట్లేదు. పర్వాలేదు నడవగలుగుతున్నా"
"సరే కాలుని ఎక్కువ శ్రమ పెట్టకు కొంచం సేపు నడిచి రెస్ట్ తీసుకో. రాత్రికి డిన్నర్ తినేసి టాబ్లేట్స్ వేసుకుని పడుకున్నావంటే రేపు పొద్దున్న కల్లా జ్వరం తగ్గిపోతుంది. ఆ ఇంకో విషయం రేపు కూడా ఆఫీస్ కి లీవ్ పెట్టి రెస్ట్ తీసుకో, ఎల్లుండి వరకు నీరసం తగ్గిపోతుంది."
"అలాగే"
"రాత్రి డిన్నర్ లోకి ఇవ్వాళ కూడా లైట్ ఫుడ్ తీసుకుందువుగాని. రాత్రికి అమ్మ వాళ్ళు వచ్చేస్తారు. అమ్మకి చెప్తాను."
"అహ వొద్దు"
"వేద మళ్ళి మొదటికి వచ్చావా?"
"అది కాదు అసలే ఆంటీ వాళ్ళు తిరిగి తిరిగి చాలా అలసట మీద వస్తారు అప్పుడు మళ్ళీ వాళ్ళని కష్టపెట్టడం ఎందుకు ఎలాగో మధ్యాహ్నం వొదిన చేసిన అన్నం రసం అలాగే ఉన్నాయి. నాకవి చాలు. వాటిని వేడి చెసుకుంటే సరిపోతుంది."
వేద చెప్పింది కూడా సబబే అనిపించింది కైలాష్ కి అందుకే అన్నాడు "సరే నీ ఇష్టం" అని, తను అనుకున్నాడు రాత్రికి అమ్మా వాళ్ళకి డిన్నర్ తెప్పిస్తే బావుంటుందని ఎలాగో వాళ్ళు వచ్చేటప్పటికి ఎంత కాదన్న ఎనిమిది దాటుతుంది. అంత అలసట మీద మళ్ళి వంట పని అంటే అమ్మా వాళ్ళకి కష్టం అవుతుంది. ఆ ఏర్పాట్లు చూడడానికి వేద తో చెప్పి బయటకి వెళ్ళాడు.
కైలాష్ వెళ్ళిన తరువాత వేద ఒక పావు గంట వరకు నడిచింది . నడుస్తుంటె కాలు నొప్పి తెలుస్తున్నా అది మరీ అంత కష్టమనిపించడంలేదు. ఒక పావు గంట నడిచి ఆ తరువాత మంచం మీద వచ్చి పడుకుంది. ఎప్పుడు నిద్ర పట్టిందో తెలీకుండానే పడుకుంది. మెలుకువ వచ్చేసరికి తన ఎదురుగా రాధ కూర్చుని ఉంది.అప్పటికి రాధా వాళ్ళు వచ్చి గంట అయ్యింది. కొంచెం సేపు ఫ్రెష్ అయ్యి వేద కి ఎలా ఉందో చూద్దామని పైకి వచ్చింది. వేద పడుకుని వుండేసరికి ఒక అరగంట చూసి లేస్తే పలకరిద్దాం అనుకుని అక్కడ సొఫాలో కూర్చుంది.వేద కళ్ళు తెరిచి తనని చూడగానే చిరునవ్వు నవ్వింది.
"ఏమ్మా ఎలా ఉంది ఇప్పుడు ఒంట్లో?"
ఆవిడని చుడగానే వేద లేచి కూర్చోబోయింది.
"పర్వాలేదమ్మ పడుకో"
ఆవిడ పర్వాలేదంటున్నా బావుండదని వేద లేచి కూర్చుంది.
"ఎలా ఉందమ్మా ఇప్పుడు ఒంట్లో"
"బానే ఉందండి జ్వరం తగ్గిపొయింది."
ఇంతలో చందన, హంస వచ్చారు. వేదని పలకరించారు.
చందన మామూలుగా అడిగింది "ఎలా ఉంది వొదినా వొంట్లో. జ్వరం తగ్గిందా?" అని
వొదిన అన్న పిలుపు వినబడేసరికి వేద తలెత్తి చూసింది అంత అలసటలోను స్థిరంగా చెప్పింది "చందన కావాలంటే వేద అని పిలు అంతే గాని వొదినా అని వరస మాత్రం కలపకు."
వేద ఆ మాట చెప్పగానే చందన రాధ వంక చూసింది
వేద చూడకుండా రాధ చందన చెయి పట్టుకుంది ఆ విషయం ఇక్కడితో వదిలేయి పొడిగించ వద్దు అని, ఆ భావం చందన కి అర్ధం అయ్యింది.
అంతలో వేద చందన అడిగిన దానికి జవాబు చెబుతునట్టుగా అంది "ఇప్పుడు పర్వాలేదు బానే ఉంది."
"ఏమ్మా భోజనం అయ్యిందా?" అడిగింది రాధ
"ఇంకా లేదండి సాయంత్రం పడుకొని ఇప్పుడే లేచాను ఒక అరగంట ఆగి తింటాను"
హంస ని అడిగింది వేద "మీ నాన్నగారికి ఎలా ఉందండి"
"తగ్గింది. ఇప్పుడు బానే ఉన్నారు. నన్ను చూడగానే బాగ కోలుకున్నరు."
వేద నవ్వింది ఇంక అంతకుమించి ఏం మాట్లాడాలో తెలియలేదు.
ఇంతలో హంస అంది "భోజనం పంపిస్తానంటే వద్దన్నావట కద ఇందాక అబ్బాయి చెప్తున్నాడు"
"అవునండి మా వొదిన మధ్యహ్నం చేసినవి ఉన్నాయి అందుకని"
"అవి ఎప్పుడో చల్లారిపోయి ఉంటాయి. ఒక రెండు నిమిషాలాగు నెను ఏదైన చేసి పంపిస్తాను"
ఆ మాటతో వేద కంగారు పడింది వెంటనే అంది "వొద్దండి పర్వాలేదు"
"అలా అంటే ఎలా అసలే ఒంట్లొ బాలేదు చల్లారినవి తింటావా. పోని అవి వెడి చేస్తా ఉండు"
"వొద్దండి"
"నువ్వు ఇంకేం మాట్లాడకు ఎంతసేపు ఒక పదినిమషాలు అంతే" అంటూ లేచి వంటింట్లోకెళ్ళింది.
వేదకి ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు.వేదకి మొహమాటంగా ఆవిడ చేత చేయించుకొవడం నచ్చలేదు. అలా అని ఆవిడ చెయకుండా ఆపనూ లేదు .
రాధ మధ్యహ్నం చేసినవి అన్ని వేడి చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టి వచ్చింది.
"అన్ని వేడి చేసాను చల్లారకుండానే తినేసెయి"
"అలాగే. థాంక్స్"
కొంచంసేపు కూర్చుని వాళ్ళు వెళ్ళారు.
వాళ్ళు వెళ్ళిపొయాక నెమ్మదిగా లేచి నడిచి వచ్చి హాల్లో కూర్చుంది. ఊరికే పడుకోవాలంటే బోర్ కొడుతోంది. ఫోన్ లో చార్జింగ్ లేకపొవడం వల్ల అది స్విచ్ ఆఫ్ అయిపోయింది. రేపు ఆఫిస్ నుండి వచ్చేటప్పుడు చార్జర్ తీసుకొని రమ్మనమని చెప్పాలి కస్తూరి కి .కస్తూరి పెళ్ళికి ఇంకా ఎక్కువ రోజులు కూడా లేదు. పెళ్ళి పనులు ఎక్కడ దాక వచ్చాయో. ఈపాటికి అన్ని అయిపొయి ఉంటాయి. ఇవ్వాళ పొద్దున్న చూసినప్పుడు దాని మొహం లో ఎంత కళ ఉందో. పెళ్ళి దగ్గరకొస్తుంటే అంతేనెమో. ఎందుకో మనసులో మళ్ళీ దిగులుగా అనిపిస్తోంది. తనకి ఆ అవకాశం లేదు. అదీ కైలాష్ వల్ల. అంతకు మించి ఆలోచనలు ముందుకు వెళ్ళనీయడం లేదు. తనకి తెలుసు ఇంక ముందుకు వెళితే వాళ్ళని అసహ్యించుకుంటుంది. వేద తల విదిలించింది. ఏంటి ఈ పరిస్థితి. లాభం లేదు ఇంకా ఎక్కువ రోజులు ఇక్కడ ఉండడం మంచిది కాదు. ఇంక నాలుగు నెలలే గడిచాయి. ఎనిమిది నెలలు ఎలా గడుస్తాయో ఏంటో. ఇలాంటి పరిస్థితి ఇంకెప్పుడు రాకుండా జాగ్రత్త పడాలి. ఆలోచనలు మనసుని కుదురుగా ఉండనీయడం లేదు అందుకే హాల్లో కొచ్చి టి.వి. పెట్టుకుంది. అయినా మనసు టి.వి మీద నిలవడంలేదు. టి.వి చూస్తోందన్నమాటే గాని ఏం చూస్తొందో వేద కి అర్ధం కావట్లేదు. తనకి తెలియకుండానే కైలాష్ కోసం ఎదురు చూస్తోంది . కైలాష్ కొసం చాలా సేపు చూసింది గాని అతను మళ్ళీ రాలేదు. అతను ఎందుకు రాలేదో వేద కి అర్ధం కాలేదు. రాధ వాళ్ళని ఈ విషయం అడుగుదామనుకుంది గాని అడగలేకపొయింది. అసలు తను కైలాష్ కోసం ఎందుకు ఎదురు చూస్తోందో తనకే అర్ధం కావడంలేదు ఆ ఎదురు చూపు తనకే ఆశ్చర్యంగా ఉంది. క్షణం ముందు ఆలోచలనలకి క్షణం తరువాత ఆలోచనలకి అసలు పొంతనే ఉండడంలేదు. బలవంతంగా ఆ ఆలోచనలనుంచి బయటపడి టి.వి. చుస్తూ కూర్చుంది. కొంచం సేపు టి.వి చూసి, డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి ఇందాక రాధ వేడి చేసిన అన్నంలో కొంచం రసం వేసుకొని తినింది. టాబ్లెట్స్ వేసుకొని పడుకొంది.
కైలాష్ అప్పుడనగా వెళ్ళాడు. ఆ తరువాత అతనికి రావడానికి మళ్ళీ కుదరలేదు, రాధ వాళ్ళకి భొజనానికి ఏర్పాట్లు చేసాడు. వాళ్ళు వచ్చాక కొంచం సేపు వాళ్ళతో కూర్చుని కబుర్లు చెప్పాడు. హంస ని కనుక్కున్నాడు వాళ్ళ నాన్నగారికి ఎలా ఉంది అని.ఇంతలో అర్జెంట్ అని హాస్పిటల్ నుండి ఫోన్ వస్తే అక్కడికి వెళ్ళాడు. వెళ్ళే ముందు వేదకి చెప్పి వెళ్దామనుకుని పైకి వచ్చాడు .కాని వేద పడుకొని ఉండేసరికి వెళ్ళిపోయాడు . అతనికి ఆ రాత్రంతా ఇంటికి రావడానికి కుదరలేదు.
ఉదయం వేద లేచేసరికి ఎనిమిది దాటింది. చాలా వరకు ఒంట్లో తేలికగా ఉంది. జ్వరం పూర్తిగా తగ్గిపొయింది. కొంచం నీరసంగా ఉంది అంతే. కాలి నొప్పి కూడా పూర్తిగా తగ్గిపోయింది. వేద మొహం కడుక్కుందామని వెళ్ళబోయింది ఇంతలో డోర్ బెల్ మోగింది. వేద వెళ్ళి తలుపు తీసింది పనమ్మాయి నిలుచిని ఉంది అక్కడ.
"గౌరీ నువ్వా రా ఎలా ఉంది మీ అబ్బాయికి"
"తగ్గిపొయిందమ్మా మీకు ఒంట్లో బాగలేదంట కద నాకు తెలీదు, సమయానికి నేను కూడా లేను మీకేమైనా అవస్థ అయ్యిందా? "
"అదేం లేదులే అయినా నాకు ఒంట్లో బాలేదని నీకు ఎవరు చెప్పారు?"
"కింద ఉండే అమ్మగారు చెప్పారు. ఇప్పుడు ఎలా ఉంది?"
"బానే ఉంది"
"మీరు ఇప్పుడే లేచినట్టు ఉన్నారు, వెళ్ళి మొహం కడుక్కుని రండి వేడి వేడిగా పాలు ఇస్తాను."
"అలాగే"
వేద మొహం కడుక్కుని వచ్చేసరికి గౌరి చెప్పినట్టుగా వేడి పాలు ఇచ్చింది. టిఫిన్ చేసింది.
వేద టిఫిన్ తిని పాలు తాగి సోఫా లో కూర్చొని టి.వి చూస్తోంది.
అయిదు రోజుల నుండి ఇంటిని పట్టించుకోకపోవడంతో ఇంటిని సద్దడానికి గౌరి కి చాలా సమయమే పట్టింది. ఒక గంటలో పని ముగించుకుంది గౌరి.
వేద తో అంది "అమ్మా పని అయిపోయింది. నేను మళ్ళీ మధ్యహ్నం వచ్చి వంట చేస్తాను వేడిగా తిందురుగాని. ఇవాళ మీరు ఆఫీస్ కి వెళ్తారా?"
"లేదు గౌరి ఇవ్వాళ సెలవు పెట్టాను నువ్వు మధ్యహ్నం రా"
"అలాగె" అంటూ వెళ్ళిపొయింది గౌరి వేద వెళ్ళి తలుపు వేసుకొని వచ్చింది.
అప్పటికే తొమ్మిది దాటింది కైలాష్ నిన్న సాయంత్రం అనగా వెళ్ళాడు మళ్ళి కనిపించలేదు ఎందుకో తెలీదు అనుకుంది వేద. తనకి జ్వరం తగ్గిపోయింది కాబట్టి రాలేదేమో అనుకుంది. మళ్ళీ తల పట్టుకుంది ఈ ఆలోచనలేంటి అసలు ఎప్పుడు కైలాష్ చుట్టూనే తిరుగుతున్నాయి తనకి నిజంగా పిచ్చి పట్టింది లేకపొతే నిన్న సాయంత్రం నుండి ఏ మాత్రం ఒంటరిగా ఉన్న ఈ ఆలోచనలన్ని ఎందుకు ఇలా చుట్టుముడుతున్నాయి.
తలుపు చప్పుడయ్యేసరికి ఉలిక్కిపడింది.వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా చందన ఉంది.
వేద కి ఆ అమ్మాయిని లోపలకి రమ్మనాలో లెదో అర్ధం కాలేదు.
గుడ్మోర్నింగ్ వొదినా ఎలా ఉంది ఇప్పుడు? అన్న పిలుపు నొటిదాకా వచ్చింది కాని పిలడానికి భయపడింది రాత్రి జరిగింది గుర్తు వచ్చింది. అందుకే మామూలుగా అంది "గుడ్మోర్నింగ్ ఎలా ఉంది ఇప్పుడు?" ఎంత అనుకున్నా వేద అని పెరు పెట్టి పిలవడానికి మనస్కరించలేదు, ఆఫిస్ లో అయితే ఎమో గాని ఇంట్లో అలా పిలవాలంటే మాత్రం మనస్కరించడంలేదు.
"పర్వాలేదు బాగానే ఉంది" వేద తటపటాయిస్తూనె ఆ అమ్మాయి లొపలికి రావడానికి వీలుగా గుమ్మం లొంచి పక్కకి జరిగి "రా" అంది.
చందన లోపలకి వస్తూ అంది "కస్తూరి ఫోన్ చెసింది నీతో మాట్లాడాలని, నీ ఫోన్ స్విఛాఫ్ వస్తొందంట కదా."
"ఔను"
"అందుకే నాకు చేసింది. నీతో మాట్లాడాలంట ఒక 5 నిమిషాలలో ఫోన్ చెస్తానంది" చందన చెప్తుండగానే ఫోన్ మోగింది.చందన వేద కి ఫోన్ ఇచ్చింది.
"హలో వేద ఎలా ఉన్నావ్?"
"బావున్నానే కాని ఇవాళ్ళ ఆఫీస్ కి రాను నువ్వు గిరితో చెప్పు"
"నేను అది చెప్దామనే ఫోన్ చేసాను ఇవ్వాళ నువ్వు రెస్ట్ తీసుకో. గిరికి నేను చెప్తాలే, ఇవ్వాళ లేట్ అయిపొయిందే నేను డైరెక్ట్ గా ఆఫీస్ కి వెళ్ళిపోతున్నా సాయంత్రం ఇంటికి వెళ్ళెటప్పుడు వస్తా"
"సరే, వచ్చేటప్పుడు చార్జెర్ తీసుకొని రా"
"సరే, ఉంటాను"
వేద ఫోన్ చందనకి ఇచ్చేసింది.
చందన ఫోన్ తీసుకొని అడిగింది "టిఫిన్ చేసావా" అని
చేసాను అన్నట్టు తలాడించింది. "ఆఫిస్ కి టైం అవుతోంది వస్తాను" అంది చందన
"సరే"
చందన వెళ్ళడానికి వెనక్కి తిరిగింది.
ఇంతలో వేద పిలిచింది చందన ని
చందన వెళ్ళబోతున్నదల్లా ఆగి వెనక్కి తిరిగి చూసింది "ఏంటి" అని
"ఏంలేదు"
"సరే" అని వెళ్ళబోయింది చందన.
వేద అడగలేకపోయింది కాని అడగకుండా కూడా ఉండలేకపోయింది మళ్ళి పిలిచింది చందనని.
చందనకి విషయం అర్ధం కాలేదు వేద ఇంతగా ఎందుకు తటపటాయిస్తొందో "ఏంటిది" అంది మళ్ళి.
వేద అడగలేక అడిగింది "కైలాష్ లేడా" అని.తనకెందుకో నమ్మకంగా అనిపిస్తొంది కైలాష్ ఇంట్లొనే ఉంతే తనకి చుడడానికి వస్తాడని అందుకే ఇంట్లో లెడా అని అడిగింది.
ఆ మాటకి చందన వేద వైపు ఆశ్చర్యంగా చూసింది.
ఆ చూపుకి వేద కలవరపడింది.